అమ్మా! నువ్వు లేని జీవితమే లేదు అనుకున్న నేను, అమ్మనే మర్చిపోయిన జీవితం గడుపుతున్నా. అమ్మా అంటే ఎక్కడ ఏడుస్తూ ఉండి పోతానేమో అని "అమ్మా" అనకుండా కొత్తలో ఉంటే సరిపోతుంది అనుకునేవాడ్ని. కానీ ఈ రోజుకీ నువ్వులేవన్న నిజాన్ని, ఆ బాధని దాటలేకపోతున్నా. అమ్మా అని గట్టిగట్టిగా పిలవాలని ఉందమ్మ. కానీ నువ్వు పలుకుతావా? నా గొంతు పైన ఎక్కడో ఉన్న నీకు వినిపిస్తుందా?
నా జీవితంలో నీతో ఉన్న 20 సంవత్సరాలు ఎంతో విలువైనవి. నువ్వు నేర్పిన పాఠాలు, చూపిన దారి, చెప్పిన మాటలు, చేయించిన వంటలు, పూజలు నన్ను ఈ రోజుకీ నడిపిస్తున్నాయ్.
ఈ రోజు(12-4-2018) అత్తయ్య వాళ్ళింట్లో ఉన్నాను. పెద్దతయ్యకి పాలు కలిపి ఇస్తుంటే నువ్వే గుర్తొచ్చావమ్మ. నీకు పాలు ఇవ్వలేని, నీ నవ్వు, నీ కోపం, నీ స్నేహం, నీ కల్మషం లేని ప్రేమకు నోచుకోని జీవితంలో ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టేనమ్మ. నేను ఎన్ని విజయాలు సాధించిన నీతో చెప్పుకోలేని విజయం నాకెందుకు అమ్మ. నువ్వు లేని ఇన్ని రోజులు ఎలా ఉన్నానో అనిపిస్తోంది అమ్మ. నువ్వు లేని నా లోకంలో సంతోషానికీ బాధకీ తేడా లేకుండా ఉంది. డబ్బు ఉన్నా లేనట్టే ఉందమ్మా.
సాధించిన విజయాలకి గుర్తింపు నువ్వు "శభాష్ రా కాశీ నాన్నా" అని అన్నప్పుడు కదా?? అలానే నేను ఓడిపోయిన ప్రతిసారీ అమ్మ నాతో ఉంటే గెలిచే వాడినేమో అనిపిస్తుంటుందమ్మా.